జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. గురువారం కావలికి చేరుకున్న పవన్, నేరుగా మధుసూదనరావు ఇంటికి వెళ్లి, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాశ్మీర్లో జరిగిన ఈ దారుణమైన ఉగ్రదాడి ప్రతి ఒక్కరినీ ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మధుసూదనరావుకు నివాళులర్పించడమే ఈ దాడి తీవ్రతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ ఘటనను కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారని, వారితో మాట్లాడినప్పుడు ఆ క్షణాల బాధను గమనించినట్లు ఆయన చెప్పారు.
“ఏ ధర్మాన్ని ఆచరిస్తారు అని తెలుసుకుని ఈ విధంగా హతమార్చడం ఎంతటి దారుణమో!” అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణం శాంతిగా ఉన్న కాశ్మీర్లో జరిగింది, ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మధుసూదన్ యొక్క మృతదేహాన్ని బుధవారం రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టుకు తరలించి, అక్కడి నుండి రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లా కావలికి తీసుకెళ్లారు. మధుసూదన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పోటులో విలపించారు.
Read More : మధుసూదన్ – భార్య కన్నీరుమున్నీరుగా వివరాలు

2 thoughts on “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు”
Comments are closed.